
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా ప్రతిపాదించిన ఎస్టిపి ప్లాంటును ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఏర్పాటు చేయబోతున్నట్లు పటాన్ చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 993 సర్వే నెంబర్ పరిధిలో ఎస్టిపి ప్లాంట్ ఏర్పాటు కోసం నిర్దేశించిన స్థలాన్ని వివిధ శాఖల అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమృత్ 2.0 పథకంలో భాగంగా పటాన్ చెరు నియోజకవర్గ పరిధిలోని ఏడు చెరువుల పరిధిలో 1100 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సెవెరజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 993 సర్వే నంబర్ పరిధిలోని 10 ఎకరాలలో ప్లాంట్ ఏర్పాటు చేయడానికి గతంలో ప్రతిపాదనలు చేయడం జరిగిందని తెలిపారు. ఇదే సర్వే నెంబర్ లో 5 ఎకరాలు స్టేడియానికి, పది ఎకరాలు నవోదయ విద్యాలయానికి సైతం కేటాయించడం జరిగిందని తెలిపారు. ఎస్ టి పి ప్లాంట్ ను స్టేడియానికి కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు చేశారని, దీని మూలంగా స్థానిక కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు తనకు ఫిర్యాదు చేశారని పేర్కొన్నారు. స్టేడియానికి కేటాయించిన స్థలంలో కాకుండా కాలనీలకు దూరంగా కేటాయించిన పది ఎకరాలలోనే ప్లాంట్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. నూతన టెక్నాలజీతో ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దుర్వాసన తలెత్తకుండా ప్లాంటు పనులు కొనసాగుతాయని తెలిపారు. తాము ఎప్పుడూ ప్రజల పక్షమేనని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.