ఆది మానవుడి తొలి ఆవాసం “జ్వాలాపురం”

ఇంద్రధనుస్సు ప్రతినిధి: ఆఫ్రికాలో ఆది మానవుడు నివసిస్తూ, ఆఫ్రికా ఖండం నుంచి భారత దేశం వచ్చినట్లుగా చరిత్ర ద్వారా తెలుసుకున్నాము. 74 వేల సంవత్సరాల క్రితం ఆది మానవుడికి సంబంధించిన ప్రపంచ చరిత్రను మార్చే ఆనవాళ్లు మన భారత దేశంలో లభించాయంటే మీరు నమ్ముతారా? అదీ తెలుగు రాష్ట్రంలోని ఒక మారు మూల పల్లెలో అని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు కదా! ఈ వీడియోలో ఆది మానవుడికి సంబంధించిన ఆనవాళ్లు ఏమిటి? అవి ఎక్కడ దొరికాయి? అసలు ఇవి ఎలా బయట పడ్డాయి? పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం!
74 వేల సంవత్సరాల ఆది మానవుడి చరిత్రను ప్రపంచానికి తెలియజేస్తున్న ఆ గ్రామం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రస్తుతం నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణానికి 11 కిలోమీటర్ల దూరంలో ఉన్న మారుమూల చిన్నపల్లెటూరు “జ్వాలాపురం” ఇండోనేషియా దేశం, ప్రస్తుత సుమత్రా దీవుల్లోని టోబా అనే పెద్ద అగ్ని పర్వతం ఉన్న ప్రదేశం నుంచి జ్వాలాపురం గ్రామం ఎయిర్ డిస్టెన్స్ సుమారుగా 2500 కిలోమీటర్లు ఉంటుంది. 74 వేల సంవత్సరాల క్రితం టోబా అగ్ని పర్వతం బద్దలై లావా విరజిమ్మడం వలన ప్రపంచం అంతా బూడిద 10 అడుగుల మేర కప్పబడి 10 సంవత్సరాల పాటు సూర్య కిరణాలు భూమిని చేరక పోవటంతో, ప్రపంచం అతి శీతలంగా మారి అప్పుడు నివసిస్తున్న జీవ జాతులన్నీ మనుష్యులతో సహా అంతరించి పోయాయి. అప్పటికే జ్వాలాపురంలో రాతి యుగానికి చెందిన మానవులు నివసించారని, అగ్ని పర్వతం విస్పోటనంతో కేవలం కొన్ని తెగల మనుషులు మాత్రమే బ్రతికారని, వారికి సంబంధించిన వారే ప్రపంచవ్యాప్తంగా జీవిస్తున్నారని పరిశోధకుల అభిప్రాయం! టోబా అగ్ని పర్వతం బద్దలై ఆకాశం ద్వారా 2500 కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్వాలాపురం గ్రామ పరిసరాల్లో ఉన్న జుర్రేరు రిజర్వాయర్ నుంచి నీరు ప్రవహించే వాగు వెంబడి ఈ లావా బూడిద పడిందని శాస్రవేత్తలు నిర్ధారించారు. జ్వాలాపురం గ్రామం దగ్గర లభించే బూడిదను శాస్రవేత్తల బృందం పరిశీలించగా అది టోబా అగ్ని పర్వతం నుంచి వెలువడిన బూడిదగా నిర్ధారణ అయ్యింది. ఇతర దేశాలకు చెందిన కొందరు పురావస్తు శాస్రవేత్తలు జ్వాలాపురం గ్రామ పరిసరాల్లో కొన్ని సంవత్సరాల పాటు త్రవ్వకాలు జరుపగా అక్కడ ఆది మానవుడు ఉపయోగించిన వివిధ రకాలైన రాతి పనిముట్లు లభించాయి. వాటిని కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి పురావస్తు మ్యూజియంలో భద్రపరిచారు.

మొదట్లో ఆది మానవుడు 60 వేల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో నివసించే వాడని, తర్వాత కాలంలో అక్కడి నుంచి భారత దేశం వచ్చాడని చరిత్ర చెప్తున్నది. కాని 74 వేల సంవత్సరాల క్రితమే అది మానవుడికి సంబంధించిన ఆనవాళ్లు జ్వాలాపురం గ్రామంలో లభించడం పరిశోధకులను సైతం ఆశ్చర్యానికి గురి చేశాయి. నేడు జ్వాలాపురం పరిసర ప్రాంతాల్లో లభించే లావా బూడిదను గ్రామ ప్రజలు మెరుగు సుద్ధగా భావించి ఎవరు ఎంత కావాలో త్రవ్వుకొని ఇళ్లకు తీసుకువెళ్ళి, వంట పాత్రలు తోముకోవటానికి ఉపయోగిస్తున్నారు. మెరుగు సుద్ధ చాలా బాగా పని చేస్తుందని తెలిసి వంట పాత్రలు తోమే పౌడర్ తయారీ సంస్థలు ఈ బూడిదను ముడి సరుకుగా వాడుతున్నాయి. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు నగరాలకు చెందిన కొన్ని కంపెనీలు ఈ బూడిదను టన్ను ₹1000 చొప్పున కొనుగోలు చేసి తరలిస్తున్నాయి. ఇప్పటికే చాలా సంవత్సరాల నుంచి 90 శాతం బూడిదను కంపెనీలు తరలించుకుపోయాయి. మరో 10 శాతం బూడిద మాత్రమే మిగిలి ఉంది. ప్రభుత్వ పరంగా నంద్యాల జిల్లా కలెక్టర్ ఈ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా చేస్తామని చెప్పినా, నేటికి అది అమల్లోకి రాలేదు. ఆది మానవుడి ఆనవాళ్లు కనుమరుగు కాక ముందే ప్రభుత్వం వెంటనే ఈ ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా ప్రకటించి, ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తే, దేశ వ్యాప్తంగా ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఈ ప్రాంతానికి దగ్గర్లో యాగంటి పుణ్య క్షేత్రం ఉండటం వలన మరింత అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మంచి నిర్ణయం తీసుకోవాలని ఇంద్రధనుస్సు ఛానెల్ తరపున కోరుతున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *