
ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాథమిక పాఠశాలల్లో విద్యా వాలంటీర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి పారదర్శకతతో నిర్వహించినట్లు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం పటాన్చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో విద్యా వాలంటీర్ల పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎంపిక కమిటీ సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని 16 విద్యా వాలంటీర్లు.. 16 ఆయా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యా వాలంటరీ పోస్ట్ కోసం ప్రధానంగా ఇంటర్మీడియట్ అర్హతతో పాటు ప్రీ ప్రైమరీ టీచర్ శిక్షణ పూర్తిచేసుకున్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వీటితోపాటు ఒంటరి మహిళ అభ్యర్థులకు అదనపు మార్కులు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఆయమ్మ పోస్టుల కోసం ఏడవ తరగతి ఉత్తీర్ణతతో కూడిన అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానించడం జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే అధ్యక్షతన ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు, తహసిల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ తో కూడిన ఎంపిక బృందం ఆధ్వర్యంలో ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు. ఎటువంటి సిఫార్సులను అనుమతించకుండా కేవలం మెరిట్ ప్రతిపాదికన అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. కమిటీ ఆధ్వర్యంలో తయారుచేసిన తుది జాబితాను జిల్లా కలెక్టర్ కు పంపడం జరుగుతుందని తెలిపారు. అతి త్వరలో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఆయా మండల విద్యాశాఖ అధికారుల కార్యాలయంలో ప్రచురించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అన్ని మండలాల తహసిల్దార్లు, విద్యాశాఖ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.