2025 మిస్ వరల్డ్ పోటీ గ్రాండ్ ఫినాలే విజేత థాయిలాండ్ సుందరి!!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా సాగిన ప్రపంచ సుందరి 2025 పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలెలో థాయ్‌లాండ్‌కు దేశానికి చెందిన “ఓపల్ సుచాట చుంగ్‌సీ” 72 వ ప్రపంచ సుందరి (Miss World 2025) గా నిలిచారు.

✳️ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి హాజరైన ప్రతినిధుల హర్షధ్వానాల మధ్య Miss World విజేతగా నిలిచిన ఓపల్ సుచాటకు 71వ ప్రపంచ సుందరి క్రిస్టినా పిస్కోవా కిరీట ధారణ చేశారు. ముఖ్యమంత్రి గారి సమక్షంలో మిస్ వరల్డ్ సీఈఓ జూలియా మోర్లీ గారు ప్రపంచ సుందరి విజేతను ప్రకటించారు.

✳️ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ప్రపంచ సుందరి ఓపల్ సుచాటకు అభినందనలు తెలియజేశారు. మిగతా కేటగిరీల విజేతలకు కూడా అభినందనలు తెలిపారు. “తెలంగాణ సంస్కృతి, వారసత్వం, చరిత్ర, విలువలు, ప్రపంచానికి చాటాం. ప్రపంచ నలుమూలల నుంచి విచ్చేసిన సందర్శకులకు తెలంగాణ రైజింగ్ దార్శనికతను చూపించాం” అని ముఖ్యమంత్రి గారు అన్నారు.

✳️ చివరి దశలో ఖండాల వారిగా టాప్‌లో నలుగురు విజేతలుగా నిలవగా చివరి పోటీలో ప్రపంచ సుందరి కిరీటం ఓపల్ సుచాటను వరించింది. ఈ 72 వ మిస్ వరల్డ్ పోటీల్లో 108 దేశాల నుంచి కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఈ నెల 7 వ తేదీన ప్రారంభమైన మిస్ వరల్డ్ పోటీల్లో వివిధ కేటగిరీల్లో అనేక దశల్లో విజేతలుగా నిలిచారు. ప్రపంచ సుందరి ఎంపిక అనంతరం హైదరాబాద్‌ నగర మేయర్‌ గద్వాల విజయలక్ష్మి గారు మిస్ వరల్డ్ 2025 పోటీలు ముగిసినట్టుగా ప్రకటించారు.

✳️ పోటీకి హాజరైన కంటెస్టెంట్లు తెలంగాణలోని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించగా, హైదరాబాద్ ఆతిథ్యం అత్యద్బుతమని కంటెస్టెంట్లు ఆనందం వ్యక్తం చేశారు. “తెలంగాణ జరూర్ ఆనా” నినాదం ప్రస్తుతం విశ్వవ్యాప్తమైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *