
ఇంద్రధనుస్సు ప్రతినిధి: ఇంట్లో ఐదారుగురు ఉంటేనే సందడి..సందడిగా ఉంటుంది. అలాంటిది అక్కడ ఏకంగా 181 మంది నివసిస్తున్నారు. అలాగని అది హాస్టల్ కాదు… కుటుంబం..! ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం..! చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అని తెలుసు.. కానీ ఇంత మంది ఉన్నా ఎలాంటి సమస్యలు లేకుండా హాయిగా ఉంటున్నారు వీరంతా..! అసలు ఈ ఫ్యామిలీ ఎక్కడుందో తెలుసా..?
ఇంటి యజమాని పేరు జివోనా చానా. ప్రపంచంలోనే అతి పెద్ద ఫ్యామిలీ ఇది. ఈ కుటుంబంలో ఏకంగా 181 మంది సభ్యులు ఉన్నారు. ఆయనకు 39 మంది భార్యలు. 94 మంది పిల్లలు, 18 మంది కోడళ్లు ఉన్నారు. అంతేకాదు 33 మంది మనవళ్లు, మనవరాళ్లతో పాటు ఓ మునిమనువడు కూడా ఉన్నాడు. వీళ్లంతా ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉంటున్నారు. ఇంట్లో 100 గదులున్నాయి. ఓ అపార్ట్మెంట్ కంటే పెద్దగా ఉంటుందన్న మాట.
ఇంతకీ ఈ ఫ్యామిలీ ఎక్కడుందో తెలుసా? మన ఇండియాలోనే..! మిజోరాం రాష్ఠ్రంలోని బత్వాంగ్ గ్రామంలో వీరు నివసిస్తున్నారు. అందమైన పర్వతప్రాంతాల్లో వీరి నివాసం ఉంది.
కుటుంబ సభ్యులంతా కలిసి మెలిసి ఉంటారు. ఒకేసారి భోజనం చేస్తారు. వీళ్ల తిండి కోసం రోజు 45 కిలోల బియ్యం, 40 కోళ్లు, 25 కిలోల పప్పు, 60 కిలోల కూరగాయలు, 20 కిలోల పండ్లు అవసరమవుతాయి.
కుటుంబ పెద్ద జివోనా చానా..తమ కొడుకులతో కలిసి కార్పెంటర్‌గా పనిచేస్తున్నారు. ఇంట్లోని మహిళలంతా వ్యవసాయ పనులు చూసుకుంటారు. చానా పెద్ద భార్య ఇంటి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటారు.
స్థానిక రాజకీయాల్లో వీరిది బలమైన కుటుంబం. ఈ ఫ్యామిలీ ఓట్ల కోసం రాజకీయ నేతలు ఎన్నో పాట్లు పడతారు. 181 మంది సభ్యులున్న మహా కుటుంబం గిన్నిస్ బుక్‌లో రికార్డులకెక్కింది. వీళ్లు కలిసి ఆడుకుంటే ఓ పెద్ద టోర్నమెంట్ జరుగుతున్నట్లే కనిపిస్తుంది.