అమీనుపూర్ లో నవోదయ స్కూల్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం స్థల పరిశీలన

ఇంద్రధనుస్సు ప్రతినిధి: పటాన్చెరు నియోజకవర్గంలోని పేద, మధ్యతరగతి విద్యార్థులకు అత్యాధునిక వసతులతో కార్పొరేట్ స్థాయి విద్యను అందించాలన్న లక్ష్యంతో నవోదయ విద్యాలయం మరియు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి.. ప్రభుత్వానికి నివేదిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గోశాల సమీపంలో గల ప్రభుత్వ సర్వే నంబర్ 993 లో విద్యాసంస్థల ఏర్పాటు కోసం స్థానిక అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే నవోదయ విద్యాలయాన్ని అమీన్పూర్ లో ఏర్పాటు చేసేందుకు కోసం ప్రభుత్వ స్థలాల వివరాలను పంపాలని ఇప్పటికే సంబంధించిన అధికారులు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం సైతం స్థల పరిశీలన చేసినట్లు తెలిపారు. నవోదయ విద్యాలయం కోసం 20 ఎకరాలు, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం 20 ఎకరాలు, మినీ స్టేడియం కోసం 5 ఎకరాలు కేటాయించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపనున్నట్లు తెలిపారు. విద్యాసంస్థలు ఏర్పాటు అయితే.. నియోజకవర్గంలోని పేద మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ విద్య ఉచితంగా అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మినీ స్టేడియం పనులను సైతం అతి త్వరలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *