
ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు ఈ రోజు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందుకు వచ్చాయి. బిఆర్ఎస్ పార్టీ పిటిషనర్ల తరపున ప్రముఖ న్యాయవాదులు సుందరం, నాయుడు వాదనలు వినిపించారు. గత విచారణ సందర్బంగా కోర్ట్ 10 మంది ఎమ్మెల్యేలకు, అసెంబ్లీ స్పీకర్, ఎలక్షన్ కమిషన్ కు నోటీసులు పంపింది. దానికి స్పందనగా పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి తాము బిఆర్ఎస్ పార్టీలో ఉన్నామని అఫిడవిట్లు సమర్పించారు. స్పీకర్ తరపున అసెంబ్లీ సెక్రెటరీ రిప్లై అందించారు. స్పీకర్ చట్టప్రకారం ఎమ్మెల్యేల అనర్హత పై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. పిటిషనర్లు స్పీకర్ నిర్ణయం తీసుకోక మునుపే కోర్ట్ కు రావడం ఆశ్చర్యంగా ఉందంటూ తమ రిప్లై లో తెలిపారు.
జస్టిస్ గవాయ్ వాదనల సందర్బంలో న్యాయవాది సుందరం ను మీరు స్పీకర్ కు ఫిర్యాదు చేసి ఎంత కాలం అయిందని అడిగారు. 18-3-2024 తేదీన స్పీకర్ గారికి ఫిర్యాదు చేశాము. ఆయన కనీసం ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా ఇవ్వకపోవడంతో తెలంగాణ హై కోర్టుకు వెళ్లినట్లు, అక్కడ సింగల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పులో నాలుగు వారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గారికి సూచించారు. అప్పటికి కూడా ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వలేదు. స్పీకర్ తరపున అసెంబ్లీ సెక్రెటరీ హై కోర్ట్ డివిజన్ బెంచ్ కి వెళ్లారు. అక్కడ స్పీకర్ తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవచ్చు అని చెప్పడంతో మేము సుప్రీం కోర్ట్ కు రావాల్సి వచ్చింది. కేసు సుప్రీమ్ కోర్టుకు వచ్చిన తదుపరి మాత్రమే స్పీకర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. కనుక మీరు పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నాము అంటూ పిటిషనర్ల న్యాయవాదులు కోరారు. సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ గారు అసెంబ్లీ స్పీకర్ తరపున వాదిస్తున్న న్యాయవాదులను, అనర్హత వేటు విషయంలో ఎందుకు స్పీకర్ ఆలస్యం చేస్తున్నారు? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా లేదని వ్యాఖ్యానించారు. చర్యలు తీసుకోవటానికి నిర్ణీత సమయం ఎంత కావాలో తెలపాలని గత విచారణలో అడిగిన విధంగానే అడిగారు. మాకు కొంత సమయం ఇస్తే స్పీకర్ గారిని సంప్రదించి చెప్తాము అన్నారు. ప్రతీ సారి మీరు ఇదే విధంగా సమయం కావాలంటూ కోర్ట్ సమయాన్ని వృధా చేస్తున్నారు. మీ ట్యాక్టిక్స్ ఇక్కడ ప్రదర్శించవద్దు అంటూ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిటిషనర్ల తరపున సుమారుగా రెండు గంటల పైగా వాదనలు వినిపించారు. స్పీకర్, అసెంబ్లీ సెక్రెటరీ, ఎమ్మెల్యేల తరపున న్యాయవాదులు తమ వాదనలను వినిపించడం కోసం కేసును ఏప్రిల్ 2 వ తేదీకి వాయిదా వేసింది సుప్రీమ్ కోర్ట్.