బీసీ రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు చారిత్రాత్మకం – కాటా శ్రీనివాస గౌడ్

ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లులు ఏకగ్రీవంగా ఆమోదం పొందడం చారిత్రాత్మకమైన ఘట్టమని పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారు తెలిపారు. ఈ సందర్భంగా పటాన్‌చెరులో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి చిత్రపటాలకు పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుతూ, అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా పాలనను ముందుకు తీసుకెళ్తోందని తెలిపారు. బీసీ సమాజానికి రాజకీయ, విద్య, ఉద్యోగ, ఆర్థిక రంగాలలో న్యాయం జరిగేలా బీసీ రిజర్వేషన్లు 42%కి పెంచడం, ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించడం ద్వారా యావత్ బహుజన సమాజానికి మేలు చేకూర్చిందన్నారు.

ఇప్పటి వరకు బీసీ, ఎస్సీ వర్గాల హక్కులను కాపాడే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోని ప్రభుత్వాలతో పోల్చినప్పుడే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయాలు ఎంత కీలకమో అర్థమవుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారు ఈ చారిత్రాత్మక నిర్ణయాల్లో ప్రత్యేక పాత్ర పోషించారని, ఈ నిర్ణయాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తాయని, కాంగ్రెస్ పార్టీ మాటలు కాదు, చేతల్లో చూపే పార్టీ అని మరోసారి నిరూపించుకుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *