
సమిష్టి కృషితో ఆదర్శ మున్సిపాలిటీగా అమీనుపూర్! పదవులు ఉన్నా లేకపోయినా ప్రజలతో మమేకం కావాలి!!
ఇంద్రధనుస్సు ప్రతినిధి: మున్సిపల్ పాలకవర్గం నిరంతర కృషి.. ప్రజల భాగస్వామ్యంతో అమీనుపూర్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దామని పటాన్ చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం అమీనుపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాలకవర్గం వీడ్కోలు సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న అమీనుపూర్ గ్రామాన్ని మున్సిపాలిటీగా మార్చడం జరిగిందని తెలిపారు. గత ఐదు సంవత్సరాల కాలంలో మున్సిపాలిటీ శరవేగంగా విస్తరించడం జరిగిందని తెలిపారు. ఇందుకు అనుగుణంగా ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేశామని తెలిపారు.
దశాబ్ద కాలంగా అపరిష్కృతంగా ఉన్న మంచినీటి సమస్యకు సైతం శాశ్వత పరిష్కారం చూపెట్టడం జరిగిందని తెలిపారు..
మున్సిపల్ పరిధిలో 80% పైగా అభివృద్ధి చేశామని పాలకవర్గ సభ్యులు తెలియజేయడం సంతోషకరమైన విషయమని అన్నారు. పదవులు ఉన్నా, లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తే సమయం వచ్చినప్పుడు ప్రజలు మళ్ళీ అవకాశం ఇస్తారని తెలిపారు. రాబోయే రోజుల్లోనూ మున్సిపల్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పాలకవర్గం సభ్యులను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, అమీనుపూర్ మాజీ ఎంపీపీ దేవానందం, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, కమిషనర్ జ్యోతి రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్స్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.