
ఇంద్రధనుస్సు ప్రతినిధి: ఈ ఫొటోలో ఉన్న పెద్దాయన పేరు యాదగిరి. అయిదేళ్ల క్రితం వరంగల్ జిల్లా నుంచి సిటీకి వచ్చాడు. అంతకు ముందు అక్కడే ఒక షావుకారు కొట్టులో జీతానికి పనిచేసేవాడు. వయసైపోయింది. షావుకారు ఇంటికి పంపించాడు. బిడ్డల ఆలనాపాలనా లేదు. ఏదోరకంగా బతుకు వెళ్లదీయాల్సిందేకదా. భార్య నూ పోషించాల్సిందే. అందుకని తనకు తోచిన ధందా ముర్మురా మిక్చర్ అమ్మడం మొదలు పెట్టాడు. ట్యాంక్ బండ్ మీద రాత్రి ఇట్లా కనిపించాడు. తినాలని లేకపోయినా ఆయనతో మాట్లాడేందుకు ఆ మిక్చర్ కొన్నాను. ఒణుకుతున్న చేతులతో కలపలేక కలిపాడు. ఈ లోపు నేనూ మాటలు కలిపాను. ఈయనైనా ఈమాత్రం కనిపిస్తున్నాడు. ఈయన భార్యకు అసలు కదిలే పరిస్థితే లేదట. ఈ ధందా చేసేవాళ్ళను చూస్తూనే ఉంటాం కదా. ఆ సరంజామా అంతా స్వయంగా మోస్తూ తిరగాలి. యాదగిరి అలాగే తిరుగుతున్నాడు. ఆ వచ్చే ఆదాయంతో ఇంటి కిరాయి కట్టాలి. తమను తాము పోషించుకోవాలి. వృద్ధాప్య పెన్షన్ మొత్తం కిరాయికి పోయినా ఇకొంత కలిపే కట్టాలి. ఇద్దరి కోసం మందులు కొనాలి. పొట్ట పోసుకోవాలి. సత్తువలేని గొంతు పీలగా వస్తుంటే చెవులు రిక్కించి వినాల్సి వస్తుంది.
నాకు యాదగిరిపై ఎంతో గౌరవం పెరిగింది. ఆయన వయసు వారు బిడ్డలు పట్టించుకోకపోతే రోడ్లపై భిక్షాటన చేస్తున్నారు. తను జీవితకాలమంతా కష్టపడి ఉండటంతో కాబోలు ఇప్పుడు అదే అలవాటుతో కష్టపడుతూ ఆత్మగౌరవంతో బతుకుతున్నాడు. తనకు ఏదైనా సాయం చేయించేందుకైనా అతడి వద్ద ఫోన్ లేదు. కేవలం ట్యాంక్ బండ్ వైపుకు వెళ్ళిన వాళ్ళకే అతడు కనిపిస్తాడు. కనిపిస్తే మటుకు అతడి వద్ద కొనుక్కుని అతడి ఆత్మగౌరవాన్ని రెట్టింపు చేయండి…ఇలాంటి వారిని ప్రభుత్వం ఆదుకోవాలి.