
ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచి తదుపరి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బి ఆర్ ఎస్ పార్టీ తరపున పాడి కౌశిక్ రెడ్డి, కె టి రామారావు దాఖలు చేసిన పిటిషన్లపై ఈ రోజు ఉదయం సుప్రీమ్ కోర్ట్ తుది తీర్పు వెలువరించింది. చీఫ్ జస్టిస్ గవాయ్ ధర్మాసనం, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని తమ తీర్పులో తెలిపింది. తెలంగాణ హైకోర్ట్ డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టి వేసింది. రాజ్యాంగం పట్ల మనం బాధ్యతగా వ్యవహరించాలని తెలిపింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను విచారించేటప్పుడు స్పీకర్ నిష్పక్షపాతంగా ఉండాలని, యేవో కారణాలు చెప్పి ఎమ్మెల్యేలు విచారణకు తాత్సారం చేస్తే అది రాజ్యాంగ ఉల్లంఘన అవుతుందని ధర్మాసనం పేర్కొంది. ఖచ్చితంగా మూడు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి అని సుప్రీమ్ కోర్ట్ చెప్పటం పార్టీ మారిన ఎమ్మెల్యేలకు షాక్ లాంటి తీర్పు అని చెప్పవచ్చు! ఈ తీర్పుతో కొంత మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి మళ్ళీ పోటీలో గెలవాలని భావిస్తున్నట్లు సమాచారం! మరి ఈ తీర్పు పర్యవసానం తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయో వేచి చూద్దాం!!