
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అర్హులైన లబ్ధిదారులందరికీ ఆహార భద్రత అందించాలన్న సమున్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు అందిస్తుందని.. ఈ నెల 29వ తేదీన పటాన్చెరు నియోజకవర్గ పరిధిలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డు లబ్ధిదారులకు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో రేషన్ కార్డు ప్రొసీడింగ్ పత్రాలను అందజేయబోతున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయా మండలాల తహసిల్దారులతో నూతన రేషన్ కార్డుల పంపిణీ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని గుమ్మడిదల, జిన్నారం, అమీన్పూర్, పటాన్చెరు, రామచంద్రపురం రెవెన్యూ మండలాల పరిధిలో నూతన రేషన్ కార్డుల కోసం 9414 దరఖాస్తులు రాగా.. అర్హులైన 2096 దరఖాస్తులు ఆమోదించి.. నూతన రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధం చేశామని తెలిపారు. ప్రస్తుతం నియోజకవర్గం వ్యాప్తంగా 74,214 రేషన్ కార్డులు వినియోగంలో ఉన్నాయని తెలిపారు.
నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుందని.. అర్హులైన ప్రతి ఒక్కరూ మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రేషన్ కార్డుల ద్వారా బియ్యం పంపిణీలో ఎలాంటి అవకతవకలు లేకుండా చర్యలు తీసుకోవాలని తహసిల్దార్లను ఆదేశించారు. ఈనెల 29వ తేదీన చేపట్టనున్న నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సంబంధించి పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆయా మండలాల తహసిల్దారులు, రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయికోటి రాజు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, తెల్లాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాములు గౌడ్, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.