
ఇంద్రధనుస్సు ప్రతినిధి: రాష్ట్ర ప్రభుత్వం కాంతారావు గారి అవార్డ్స్ ప్రకటిస్తే ఆ సభకి రావటానికి కాంతారావు గారి కొడుక్కి ఎవరో 1000 రూపాయలు ఇస్తే కానీ అతను రావటానికి అవ్వలేదు అని విన్నాను. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఖచ్చితంగా తెలియదు కానీ, ఆ మాట వినటం బాధ అనిపించింది.
కాంతారావు గారికి వంశ పారంపర్యం గా 500 ఎకరాల పొలం వచ్చింది. ఇంకా 400 సినిమాల్లో నటించారు. ఉన్నదంతా దాన ధర్మాలు, ఇంకా స్థలాలు ఏమీ కొనకపోగా ఉన్న వాటిని అమ్మి సినిమాలు తీసి నష్టపోయారు.
చాలా ఎక్కువ డబ్బులు పెట్టి మద్రాసు లో 2 వేల గజాల్లో ప్యాలెస్ లాంటి బంగ్లా కట్టించారు. బాత్రూం నే బెడ్ రూం అంత పెద్దది అని అప్పట్లో కథలు కథలు గా చెప్పుకునేవారు ఆ ప్యాలెస్ గురించి. ఆ తర్వాత సినిమాలు తీసి అప్పులు అవటంతో చాలా తక్కువ ధరకి ఇంటిని అమ్మి అపార్ట్ మెంట్ లో రెంట్ కి దిగాల్సి వచ్చింది.
రాజభోగం అనుభవించిన నట ప్రపూర్ణ కాంతారావు గారు చివరి దశలో వనవాస జీవితం అనుభవించారు. కాల్ షీట్స్ లేవు అని చెప్పిన అతను చివరికి “వచ్చే నెల ఇంటి అద్దె ఎలా కట్టాలి” అని లెక్కలు వేసుకున్నారు జీవిత చరమాంకం లో అని కొందరు అన్నారు. హైదరాబాద్ లో సొంత ఇల్లు కట్టుకోవాలి అనే కోరిక తీరకుండానే వెళ్ళిపోయారు. అతను చేసిన పొరపాట్లు కొన్ని అయితే రాజకీయాలకి బలి అవటం మరొక తప్పిదం. సినిమాల్లో కత్తి తిప్పాడు కానీ జీవిత యుద్ధం లో ఆ రాజకీయాలకి బలైపోయాడు. సినిమాల్లోనే కాదు జీవితం లో కూడా అడుగడుగునా అడ్డంకులు, కుట్రలు, కుతంత్రాలు ఉంటై, వాటిని తట్టుకొని నిలవాలి కానీ సత్య హరిశ్చంద్రుడి లాగా ఆడిన మాట తప్పకూడదు అనే ఒకే నియమం తో ఉంటే మొత్తం రాజ్యన్నే కోల్పోతారు; కాంతారావు గారి విషయం లో అదే జరిగింది.
1923 లో కాంతారావు గారు జన్మిస్తే 1924 లో అక్కినేని నాగేశ్వరావు గారు జన్మించారు. ఉట్టి చేతులతో హైదరాబాద్ వచ్చి వందల, వేల ఎకరాలు అక్కినేని వాళ్ళు కొనగలిగారు కానీ వందల ఎకరాలు ఉన్న కాంతారావు గారు కనీసం హైదరాబాద్ లో ఇళ్ళు కూడా కట్టుకోలేకపోయారు.
ఏది ఏమైనా, కత్తిలా బతికి వెండితెరపై కత్తి యుద్ధాలతో స్వైరవిహారం చేసి తొలి తెలంగాణ సినీ కథానాయకుడిగా పేరొందిన మహానటుడు, జానపద కథానాయకుడు తాడేపల్లి లక్ష్మీకాంతారావు గారు. తెలుగు సినిమా చేసుకున్న ఒక అదృష్టం కాంతారావు గారు. 1951 లో రోహిణి పిక్చర్స్ వారి నిర్ధోషి సినిమా తో నటుడు గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి, ఎన్నో వైవిధ్యమైన విభిన్న పాత్రలలో రక్తి కట్టించి, 2004 లో “మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు” అనే సినిమా తో ముగించారు జానపద రాకుమారుడు, సహజ నట శిరోమణి & దక్షిణ భారతదేశ ధ్రువతార లక్ష్మీకాంతారావు గారు.
400 కు పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించిన మహానటుడు ఉన్నది అంతా దానధర్మాలు చేశాడు కానీ తనకి, తనవారికి పెద్దగా ఆస్థులు ఏమీ మిగల్చలేదు గండర గండడు. సినిమాల్లో అయితే చివర్లో పోగొట్టుకున్నవి అన్నీ తిరిగి వచ్చేస్తాయి లేదా దాన ధర్మాలకి మెచ్చి ఎవరో వరం ఇస్తారు కానీ జీవితం కదా అవేమీ తిరిగి రాలేదు. రావు కూడా, ఇక్కడ డబ్బే ముఖ్యం.
నువ్వు దేని గురించి అయినా అలోచించాల్సి వస్తే డబ్బు గురించే ఆలోచించు, డబ్బు సంపాదన గురించే ఆలోచించు. “ప్రాణం పోయినా పర్వాలేదు కానీ డబ్బు పోకూడదు, పోగొట్టుకోకూడదు” అంటాడు ఒక రోమన్ తత్వవేత్త.