సిగాచి కంపెనీలో యాజమాన్య నిర్లక్ష్యంతోనే ఇంత మంది ప్రాణాలు కోల్పోయారు – ఎమ్మెల్యే జిఎంఆర్

ఇంద్రధనుస్సు ప్రతినిధి: సిగాచి కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారుల తూతూ మంత్రంగా చేపట్టే తనిఖీల మూలంగానే ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందని పేలుడులో మరణించిన ప్రతి కార్మికుడి కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, గాయపడిన వారికి మెరుగైన వైద్యంతో పాటు 50 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. పటాన్చెరు నియోజకవర్గ పాశమైలారం పారిశ్రామిక వాడలో గల సిగాచి పరిశ్రమలో సోమవారం ఉదయం రియాక్టర్ పేలుడు జరిగిన విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే జిఎంఆర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా డిఐజి ఇక్బాల్, జిల్లా కలెక్టర్ ప్రావిణ్య, ఎస్పీ పరితోష్ పంకజ్ తో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకున్నారు. ఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పరిశ్రమ నడిపిస్తున్న సిగాచి యాజమాన్యం ఎప్పుడు కూడా కార్మికుల భద్రత కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే పరిశ్రమలో భారీ పేలుడు సంభవించి పెద్ద సంఖ్యలో మృతి చెందారని తెలిపారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిన పరిశ్రమల తనిఖీల విభాగం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్మికుల భద్రతను గాలికి వదిలేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఒకసారి ప్రమాద సంఘటన జరిగినప్పటికిని యాజమాన్యం గుణపాఠం నేర్చుకోకుండా తిరిగి భద్రతా ప్రమాణాలు పాటించకుండా పరిశ్రమలు నడిపిస్తూ కార్మికుల పాలిట యమపాశంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి.. ఘటనకు కారకులైన యాజమాన్యం, నిర్లక్ష్యం వహించిన పరిశ్రమ విభాగం అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *