
ఇంద్రధనుస్సు ప్రతినిధి: థాయిలాండ్లో ప్రత్యేకమైన ఆతిధ్యం ముఖ్యంగా భోజనం పూర్తయ్యాక గొప్ప విలాసవంతమైన విందు, చివరగా ఒక ఐస్ క్రీమ్ తో లేదా ఫ్రూట్ బౌల్ తో పూర్తవుతుంది. ఫ్రూట్ బౌల్ తీసుకొని తింటుంటే ఒక విధంగా అద్భుతమైన రుచి అనే చెప్పాలి. అయితే ఆ గుప్పెడు ఫ్రూట్ బౌల్ ఖరీదు నాలుగు వేల ఐదు వందల రూపాయలు.. నిజం. ఎందుకంత ఖరీదు అనే ప్రశ్న, అవాక్కు, కుతుహలం వెంట వెంటనే కలుగుతాయి. అప్పుడు తెలుసుకున్నది ఏమిటంటే, అందులో వేసిన నాలుగైదు చిన్న చిన్న మియాజాకి మామిడి పండు ముక్కల మహత్యం గురించి..
ప్రకృతి కూడా చాలా చిత్రమైన స్వభావం అత్యంత విలువైనదానిని అత్యంత నెమ్మదిగా పెంచుతుంది.
ప్రపంచంలో మామిడిపండ్లు అనేక రకాలున్నా, కొన్ని ప్రత్యేకమైనవి. అందులో ఒకటి మియాజాకి మామిడి, ఇది కేవలం పండు మాత్రమే కాదు. ఇది విలువకు, ప్రత్యేకతకు, మరియు సహజ శ్రమకు నిలువెత్తు నిదర్శనం.
ఈ మామిడి పుట్టింది జపాన్‌లోని మియాజాకి ప్రిఫెక్చర్‌లో. కానీ దీనికి ఉన్న మహత్తు ఈ చిన్న పరిచయంతో పూర్తవదు. ఎందుకంటే, ఇది ఓ సాధారణ పండు కాదు దీనిని సన్ ఎగ్ మాంగో అని కూడా పిలుస్తారు, అంటే ఎగిరే సూర్యుడి మామిడి!
ఏది విలువైనదో, అది పెరగడానికి ఎక్కువ శ్రమపడుతుంది. అది ఒక మామిడి కాదు, అది ఓ కళాఖండం అని చెప్పవచ్చు.
సాధారణ మామిడిపండ్లకు ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దీని రంగు మామూలుగా ఉండదు. గులాబీ, ఎరుపు, ఉదా రంగుల మేళవింపుతో ఒక అరుదైన అందాన్ని కలిగి ఉంటుంది. తియ్యని రుచి, నోట్లో కరిగిపోయే మృదుత్వం, కమ్మని పరిమళం… ఇవన్నీ దీనిని అత్యంత విలువైన మామిడి పండుగా మార్చాయి..
ఒక సాధారణ మామిడి చెట్టు వేలాది పండ్లను ఇస్తుంది. కానీ మియాజాకి మామిడి చెట్టుకు సంవత్సరానికి చాలా తక్కువ పండ్లు మాత్రమే వస్తాయి. ఎందుకంటే, ఇది సాధారణ పెంపక విధానాలకు భిన్నంగా, అత్యంత శ్రద్ధతో పెంచబడుతుంది.
ఇవి బలమైన ఎండలో పెరగాలి. అందుకే దీని పేరు “సన్ ఎగ్” – ఈ మామిడి పండుగానే కాదు, సూర్యుని కిరణాలను తనలో నింపుకున్న అరుదైన పండు.
ఎంత ఖరీదైనా, అసలు విలువ దాని లోపలే ఉంటుంది. మీకు తెలుసా?
ఒక మియాజాకి మామిడి దాదాపు కేజీ 2.5 లక్షల వరకు ధర పలుకుతుంది.
కొన్ని వేల రూపాయలు ఇచ్చిన కూడా దొరకడం చాలా అరుదు.
ప్రతి పండు ప్రత్యేకమైన గుణాలు కలిగి ఉంటేనే దానికి అత్యున్నత ధరకు అమ్ముతారు.
కానీ దీనిని ఖరీదైనదిగా చూసే ముందు, దాని వెనుక ఉన్న సహజత్వాన్ని గుర్తించాలి. మనం కేవలం ఆర్ధిక విలువతోనే కాకుండా, పెంపకం శైలిని, ప్రత్యేక రుచిని, ప్రకృతిని అర్థం చేసుకోవాలి.
మనం ఎంత ప్రయత్నించినా, ప్రకృతిని మించిన విలువను సృష్టించలేం. కళాత్మకత, సహజత్వం కలిసినప్పుడే అసలు అందం ఉద్భవిస్తుంది.
అందుకే, మియాజాకి మామిడిని గురించి విన్నప్పుడల్లా, మన జీవితాన్ని కూడా అలాగే చూడాలి. సహనంతో ఎదగాలి. సహజత్వాన్ని ఆహ్వానించాలి. విశ్వాసంతో ఎదుగుదల సాధించాలి.
మియాజాకి మామిడి – ప్రకృతితో నడిచిన ఓ ప్రయాణం. అసలైన విలువ ధరలో కాదు, దాన్ని అర్థం చేసుకునే మన మనసులో ఉంటుంది.
జపాన్ లో మాత్రమే అరుదైన పండ్లు పెరుగుతాయి కాని థాయిలాండ్ లో చాలా అరుదుగా ఎక్కడో ఒక చోట మాత్రమే పెరుగుతాయి.. అన్ని పండ్లు అనుకున్నట్టుగా వస్తాయా అంటే చెప్పలేం, అక్కడి గ్రామంలో వ్యవసాయ విధానం చాల ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ప్రతి విత్తనానికి ఓ గౌరవం ఉంటుంది, ప్రతి పండుకు ఓ కథ ఉంటుంది. మియాజాకి మామిడి కథ కూడా అలాంటిదే.
రైతుల కష్టాన్ని, ప్రకృతిని గౌరవించే విధానాన్ని అక్కడ చూడవచ్చు. ఓ చిన్న పండుకి అంత శ్రద్ధ అవసరమా? అని మొదట అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత అది కేవలం పండుకాదు… అది ఒక ప్రాక్టీస్, ఒక కళా ప్రక్రియ, ఒక జీవన విధానం అని అర్థమవుతుంది.
ఈ మామిడిని సాధారణంగా పెంచరు. ప్రత్యేకమైన ఎండ, తేమ, గాలి ప్రతీది సమపాల్లలో ఉండేలా జాగ్రత్తగా పెంచుతారు. ఒక్కో పండును చేతితో పట్టుకుని చూస్తే, అది నెమ్మదిగా సున్నితంగా ప్రేమగా పెరిగిందని, ఎంతో సహనంగా తీర్చిదిద్దారని అర్థమవుతుంది.
ప్రకృతి తనదైన శైలిలో, తన గమనంలో నడుస్తుంది. మనం ఎంత త్వరగా ఎదగాలని అనుకున్నా, ప్రకృతికి ఎప్పుడూ నిర్ధిష్టమైన ఓ పరిపూర్ణమైన సమయాన్ని కేటాయిస్తుంది. మనం నమ్మి, ఎదురు చూడాలి. అదే సహనం, అదే అసలైన అర్ధం.
మనలో చాలా మందికి ఒక పండు లక్షలు పలికిందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఆ ధర దాని రుచికి కాదు, దాని వెనుక ఉన్న కష్టానికి, సహనానికి, ప్రేమకి. మన జీవితంలోనూ ఇలానే కదా? మన శ్రమను, ఎదుగుదలను బయటివారు అర్థం చేసుకోవడం కష్టం. కానీ సహనం మనలో ఉంటే, మన విలువను ప్రపంచం తప్పక గుర్తిస్తుందనే నమ్మకం ఉండాలి.
ప్రకృతిని గమనించడం అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడమే..
పండ్లను కోసే ముందు వృక్షాన్ని గమనించు, జీవితాన్ని అర్థం చేసుకునే ముందు కాలాన్ని గమనించు. ఈ మియాజాకి మామిడి పండ్లు మన ఇండియాలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పెంచుతున్నట్టు సమాచారం!
అన్నింటికంటే గొప్ప రుచి జీవితానికే ఉంటుంది – అది ఎలా ఎదిగిందో మనం ఎలా అర్థం చేసుకున్నామో అనే దాని బట్టే మన జీవితపు తీపి విలువ దాగి ఉంటుంది.