
ఇంద్రధనుస్సు ప్రతినిధి: మైసూర్ దత్తపీఠం ఆధ్వర్యంలో నిర్వహించిన “భగవద్గీత-700 శ్లోకాలు” కంఠస్థం పోటీల్లో అమీనుపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీకి చెందిన మహిళామణులు శ్రీమతి రాణి ప్రభావతి, శ్రీమతి కె. రామలక్ష్మి విజేతలుగా నిలిచి గోల్డ్ మెడల్ సాధించారు. భగవద్గీత శ్లోకాలు ఎంతో సాధన చేస్తే తప్ప గుర్తుండవు. ఆధ్యాత్మికంగా భగవద్గీతకు ఉన్న ప్రాధాన్యతను అందరికీ అందించాలనే సంకల్పంతో మైసూరులోని దత్త పీఠం వారు ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ క్లాసులను నిర్వహిస్తూ, భగవద్గీతను బోధిస్తున్నారు. భగవద్గీతలోని 700 శ్లోకాలు కంఠస్థం పోటీలు నిర్వహించి, అందులో అత్యుత్తమ ప్రతిభ సాధించినవారికి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్ మరియు ప్రశంసాపత్రం బహూకరిస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీనుపూర్ మున్సిపాలిటీ పరిధిలోని వందనపురి కాలనీకి చెందిన మహిళామణులు శ్రీమతి రాణి ప్రభావతి, శ్రీమతి కె. రామలక్ష్మి” భగవద్గీత 700 శ్లోకాలు కంఠస్థం పోటీలో” పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరచి మైసూరు దత్త పీఠం వారు అందించే గోల్డ్ మెడల్స్ సాధించారు. హైదరాబాద్ నగరంలోని దుండిగల్ అవధూత దత్త పీఠంలో శ్రీమతి కె. రామలక్ష్మి గారు శ్రీరామనవమి పండుగ రోజున శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ గారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం అందుకున్నారు. శ్రీమతి రాణి ప్రభావతి గారు 17 మే 2025 తేదీన మైసూరు దత్త పీఠంలో అప్పాజీ వారి చేతుల మీదుగా గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం అందుకోబోతున్నారు. వందనపురి మహిళామణులు సాధించిన ఈ ఘనతకు వందనపురి కాలనీవాసులు వారికి అభినందనలు తెలుపుతూ, తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.