
ఇంద్రధనుస్సు ప్రతినిధి: తెలంగాణ శాసన సభ 10 మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి అందరికీ తెలిసిన విషయమే! ప్రస్తుతం ఈ కేసు సుప్రీమ్ కోర్టులో విచారణ జరుగుతున్నది. సుప్రీమ్ కోర్ట్ గత విచారణ సందర్బంగా పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేయటం, తదుపరి వారందరికీ మరియు అసెంబ్లీ స్పీకర్, సెక్రెటరీకి నోటీసులు ఇచ్చింది. 22 మార్చి 2025 తేదీలోగా రిప్లై ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
నోటీసులు అందుకున్న 10 మంది ఎమ్మెల్యేలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సుప్రీమ్ కోర్టుకు తప్పకుండా రిప్లై ఇవ్వాల్సిన పరిస్థితి ఉండటంతో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తాను అసలు పార్టీ మారలేదని, సీఎం ను మర్యాదపూర్వకంగా కలిశానని, నియోజకవర్గం అభివృద్ధి నిధుల కోసం సీఎం ను కలిశానని దానిని మీడియా వక్రీకరించిందని సుప్రీమ్ కోర్టుకు ఇచ్చిన అఫిడవిట్లో పేర్కొన్నారు. పటాన్ చెరు ఎమ్మెల్యే బాటలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు అఫిడవిట్లు సుప్రీమ్ కోర్టుకు సమర్పించినట్లు సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్నది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు చివరికి తప్పుడు అఫిడవిట్లు ఇచ్చి సుప్రీమ్ కోర్టును సైతం మోసం చేస్తున్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అన్ని విషయాలను ప్రజలు గమనిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 25 వ తేదీన సుప్రీమ్ కోర్టు విచారణలో ఏ తీర్పు వస్తుందో వేచి చూడాల్సిందే!