
ఇంద్రధనుస్సు ప్రతినిధి: రాబోయే గణతంత్ర దినోత్సవం సందర్భంగా పటాన్ చెరు పట్టణంలోని మైత్రి మైదానంలో నిర్వహించనున్న ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో శనివారం సాయంత్రం స్థానిక శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఏటా మాదిరిగానే జాతీయ జెండా ఆవిష్కరణ, వివిధ పాఠశాలల విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు, మార్చ్ ఫాస్ట్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన పాఠశాలలకు నగదు బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రదర్శనలకు అనుగుణంగా మైదానంలో ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం మైత్రి మైదానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పోరేటర్ మెట్టు కుమార్ యాదవ్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, మండల విద్యాధికారి నాగేశ్వర్ నాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, పటాన్ చెరు సీఐ వినాయక్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల హెడ్మాస్టర్లు పాల్గొన్నారు.