కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సుప్రీం కోర్టులో పిటిషన్లు వేసిన బిఆర్ఎస్ పార్టీ!!

ఇంద్రధనుస్సు ప్రతినిధి: అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బిఆర్ఎస్ పార్టీ తరపున సుప్రీం కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. అందులో ఒకటి 7 మంది ఎమ్మెల్యేల మీద రిట్ పిటిషన్ కాగా మరొకటి ఎస్.ఎల్.పి పిటిషన్. దానం నాగేందర్, తెల్లం వెంకట్ రావు, కడియం శ్రీహరి ముగ్గురు ఎమ్మెల్యేల మీద ఎస్.ఎల్.పి. పిటిషన్ వేయగా మిగతా 7 మంది ఎమ్మెల్యేల మీద రిట్ పిటిషన్ వేశారు. బిఆర్ఎస్ పార్టీ నాయకుడు హరీష్ రావు ఢిల్లీలో ఉండి దీనికి సంబంధించిన కార్యక్రమాలు చూస్తున్నారని మీడియాలో ప్రచారం జరిగింది. గతంలో తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో నెలరోజుల్లో శాసన సభ స్పీకర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. స్పీకర్ ఏ నిర్ణయాన్ని తీసుకోకపోవడమే కాకుండా శాసన సభ కార్యదర్శి ఈ విషయం మీద హైకోర్టు డివిజన్ బెంచ్ లో అప్పీల్ కు వెళ్లారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన డివిజన్ బెంచ్, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ఆపివేసింది. స్పీకర్ తన పరిధిలో నిర్ణయం తీసుకోవచ్చు అని డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దాంతో అప్పటి వరకు వేడివేడిగా ఉన్న ఎమ్మెల్యేల అనర్హత అంశం చల్లబడిపోయింది. బిఆర్ఎస్ పార్టీ ఈ విషయంలో రాజీ పడకుండా సుప్రీం కోర్టు దాకా వెళ్ళింది. సుప్రీం కోర్టులో ఏమి జరుగుతుందో వేచిచూద్దాం! మరో వైపు కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. సుప్రీం కోర్టులో గతంలో ఇలాంటి తరహా పిటిషన్ల మీద వచ్చిన తీర్పులు చూస్తే, ఈ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే 10 మంది ఎమ్మెల్యేలు అందరూ గెలుస్తారని నమ్మకం లేదు. ప్రజల్లో వారి పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టం అవుతున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *