
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయ కోదండ రామస్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా 22-12-2024 తేది ఆదివారం ఉదయం 10 గంటల నుంచి శ్రీపుష్ప యాగం వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ ప్రధానార్చకులు, తిరుపతి మరియు ద్వారకా తిరుమల నుంచి వచ్చిన ఋత్విక్కులు ఆలయానికి దిగువన ఏర్పాటు చేసిన సభావేదికపై శ్రీపుష్ప యాగం కార్యక్రమానికి శ్రీ వైఖానస సంప్రదాయం ప్రకారం సంకల్పం చెప్పి, పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. శ్రీపుష్పయాగం నిమిత్తం విరాళాలు ఇచ్చిన భక్తులు వందనపురి పుర వీధుల్లో వివిధ రకాలైన పుష్పములు కలిగిన పూల బుట్టలను తలపైని పెట్టుకొని సన్నాయి మేళంతో ఉరేగింపుగా వందనపురి మెయిన్ రోడ్ నుంచి బయలుదేరి రామాలయం ప్రాంగణానికి చేరుకున్నారు. భక్తులు తెచ్చిన పూల బుట్టలను ఋత్విక్కులు స్వీకరించి, శ్రీపుష్ప యాగంలో వివిధరకాల పుష్పాలను శ్రీ సీతారాముల వారికి సమర్పించారు. ముందుగా విష్ణువుకు ప్రీతికరమైన తులసీదళాలతో శ్రీ పుష్ప యాగం ప్రారంభించారు. అనంతరం 11 రకాల పుష్పాలతో స్వామి వారికి అర్చన చేశారు. స్వామి వారి పుష్ప యాగంలో ఏ రకం పూలు స్వామికి అర్పిస్తున్నారో దానికి అనుగుణంగా మంత్రోచ్చారణ చేస్తూ, నృత్యం, గానం, వీణ తదితర సేవలను స్వామి వారి ముందు ప్రదర్శించారు. స్వామి వారికి సంవత్సరంలో నిర్వహించే అన్ని ఉత్సవాల్లో తెలియక జరిగే పొరపాట్లు పరిహరింపబడటానికి ఆలయంలో హోమం నిర్వహించారు. భక్తుల గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు జరిపారు ఋత్విక్కులు. వైఖానస సంప్రదాయం ప్రకారం నిర్వహించిన శ్రీపుష్పయాగం తిరుమల క్షేత్రంలో సంవత్సరానికి ఒక పర్యాయం జరుపుతారు. వందనపురి రామాలయం ప్రతిష్ఠ జరిగిన తర్వాత మొదటి సారి శ్రీపుష్పయాగం నిర్వహించారు. అనంతరం భక్తులందరికీ స్వామి వారి అన్న ప్రసాద వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. సర్వేజనా సుఖినోభవంతు!! వేద ఆశీర్వచనంతో కార్యక్రమం ముగిసింది.