
ఇంద్రధనుస్సు ప్రతినిధి: అమీనుపూర్ మున్సిపల్ పరిధిలోని వందనపురి కాలని రామాలయంలో ధనుర్మాసం సందర్భంగా 22-12-2024 తేది ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీ అభయ కోదండ రామస్వామి వారికి శ్రీపుష్పయాగం నిర్వహించబడుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. తిరుమల క్షేత్రంలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా వైఖానస సంప్రదాయం ప్రకారం వందనపురి రామాలయంలో మొదటి సారి ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వందనపురి మెయిన్ రోడ్ వద్ద నున్న రామాలయం కమాన్ నుంచి పుష్పయాగం కోసం విరాళాలు ఇచ్చిన భక్తులు వివిధ రకాలైన పూల బుట్టలతో ఊరేగింపుగా బయలుదేరి, రామాలయం చేరుకొని శ్రీ సీతారాముల వారికి పుష్పాలతో అర్చించే ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి వారి తీర్థ, ప్రసాదాలు స్వీకరించమని నిర్వాహకులు కోరుతున్నారు. శ్రీ పుష్పయాగంలో హోమం కూడా నిర్వహించడం వలన సంవత్సరం పొడవునా జరిగే స్వామి వారి ఉత్సవాల్లో తెలియక చేసే పొరపాట్లకు పరిహారం లభిస్తుందని ఆగమశాస్త్రం తెలియజేస్తున్నది. శ్రీపుష్పయాగం అనంతరం అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేయబడుతుందని నిర్వాహకులు తెలిపారు.