జీవిత పాఠం ఎవరు నేర్పుతారు?

కొన్ని నెలల క్రితం నాగార్జున సాగర్ వెళ్ళాము. ఎండ పేలిపోతున్నది.
రోడ్డు పక్కన ..ఎర్రటి ఎండలో కూర్చుని దానిమ్మ పండ్లు అమ్ముతున్నారు కొందరు మహిళలు.
మనమైతే అంత ఎండలో పది నిముషాలు కూడా ఉండలేము. చెమటలు కారిపోతున్నాయి.
“ఎలా ఇస్తావ్” అడిగాను.
“వందకు అయిదు. ఆరిస్తాను తీసుకోండి..” చెప్పింది.
“అదేమిటి? నువ్వే అయిదు అన్నావు. నువ్వే ఆరంటున్నావు.?” ఆశ్చర్యంగా అడిగాను.
“నేను అనకపోయినా మీరు అడుగుతారు గదండి…చెప్పడమే ఆరు చెబితే మీరు ఏడు అడుగుతారు.” అన్నది ముఖంలో ఎలాంటి కవళికలు లేకుండా.
మానవ మనస్తత్వాలు చదవడానికి యూనివర్సిటీకి వెళ్లి సైకాలజీ కోర్సులు చదవక్కరలేదు. మనచుట్టూ ఉన్నవారు ఎన్నో బోధించగలరు. అనుభవం గొప్ప పాఠాలను నేర్పుతుంది.
దాదాపు పదిహేను ఏళ్ళ క్రితమే ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. రోడ్ల పక్కన అమ్మే కూరలు, పండ్లు కొనేటప్పుడు బేరం చెయ్యటం మానేశాను. ఇష్టమైతే కొంటాను లేకపోతే లేదు.

పెద్ద పెద్ద మాల్స్ కు వెళ్తే అరటిపళ్ళు కూడా కిలోల లెక్కన అమ్ముతారు. కిలోమీద ఒక్క గ్రాము ఎక్కువ ఉన్నా దానికీ బిల్లు పడుతుంది. దోసకాయలు అరకిలో తీసుకుంటే మీడియం సైజువి మూడు వస్తాయి. నిజానికవి మరో యాభై..వందగ్రాములు ఎక్కువే ఉంటాయి. కానీ వీధుల్లో కూరలు అమ్మేవారు అరకిలోగానే లెక్కిస్తారు. ఏసీ మాల్స్ కు వెళ్తే అరగ్రాము బరువు కూడా కౌంట్ చెయ్యబడుతుంది.

ఒక ఖరీదైన రెస్టారెంట్ కు వెళ్తే కప్పు కాఫీ యాభై రూపాయలు ఉంటుంది. అదనంగా టాక్స్ ఉంటుంది. నోరెత్తకుండా కట్టేస్తాం. రెండు రూపాయలు తగ్గిస్తావా అని అడగం. పైగా గొప్పలకు పోయి తెచ్చినవాడికి టిప్పుగా పదిరూపాయలు ఇస్తాము. మనం టిప్పు ఇవ్వకపోయినా వాడేమీ ఏడవడు. ఇచ్చినంతమాత్రాన మన కాళ్ళమీద పడి దణ్ణం పెట్టడు. అంతా మనం తెచ్చిపెట్టుకున్న హెచ్చులే.

బ్యాంకులకు వేలకోట్లు ఎగగొట్టి విదేశాలకు పారిపోయేవారు, అధికారపార్టీలో దూరిపోయి చట్టం నుంచి తప్పించుకునేవారిలా వీధుల్లో అమ్ముకునే చిరువ్యాపారులు దేశద్రోహులు కారు కదా? మాల్స్, రెస్టారెంట్స్ కు వెళ్లి ఎంత చెబితే అంతకు నోరు మూసుకుని కొనే మనకు వీధుల్లో కూర్చుని, ఎండల్లో తిరుగుతూ చెమటలు కక్కుతూ, అమ్ముకునే కష్టజీవుల దగ్గర నోరు తెరిచే హక్కు ఎక్కడిది? వారికో రూపాయి ఎక్కువ ఇచ్చినా తప్పేముంది? ఆ రూపాయితో మన పిల్లలకు చాకోలెట్ కూడా రాదు.

సమాజాన్ని పరిశీలిస్తే ఎన్నో తెలుసుకోవచ్చు. కథలు కూడా ఇలాంటి పరిశీలన వలనే పురుడు పోసుకుంటాయి. సామాన్యుడు వెంటనే మరచిపోతాడు. రచయిత దాన్ని కథా శిల్పంగా చెక్కి సమాజానికి కథ రూపం లో అందిస్తాడు.

రోడ్ల పక్క కూరగాయలు, పండ్లు అమ్మేవారికి చేయూతనివ్వండి! వారి చెమట విలువ గుర్తించాలి!

ఒక మిత్రుడు పంపిన యదార్ధ గాథ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *