
ఇంద్రధనుస్సు ప్రతినిధి: కుంకుమ పువ్వు (Saffron).. ఈ పేరెత్తితే మనకు వెంటనే గుర్తుకొచ్చేది కశ్మీర్. ‘ఎర్ర బంగారం’గా పేరొందిన ఈ సుగంధ ద్రవ్యాన్ని మన దేశంలో ఎక్కువగా పండించేది అక్కడే. వంటలు మొదలు ఔషధాలు, సౌందర్య ఉత్పత్తుల వరకు దీని వినియోగం అధికం. ఈ క్రమంలోనే కశ్మీర్ ప్రకృతి అందాలను వీక్షించేందుకు వెళ్లిన ఓ రైతు.. అక్కడ కుంకుమ పువ్వు సాగును చూసి ప్రేరణ పొందాడు. ఆధునిక వ్యవసాయ పద్ధతులను పాటించి తన ఇంటివద్దే పంట సాగు మొదలుపెట్టాడు.
మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌కు చెందిన అనిల్ జైస్వాల్ కొన్నేళ్ల క్రితం కుటుంబంతో కలిసి కశ్మీర్‌కు వెళ్లాడు. అక్కడి పంపోర్‌లో కుంకుమ పువ్వు సాగును చూసి స్ఫూర్తి పొందాడు. స్వస్థలంలోనూ అదే పంటను పండించాలనుకున్నాడు. దానికోసం మట్టి అవసరం లేని అధునాతన ‘ఏరోపోనిక్స్’ విధానాన్ని అవలంబించాడు. కశ్మీర్ మాదిరి ఉష్ణోగ్రత, తేమ, కాంతి, కార్బన్ డయాక్సైడ్‌లతో కూడిన నియంత్రిత వాతావరణాన్ని సైతం సృష్టించాడు. ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ పంట సాగు విషయాలను పంచుకున్నాడు.‘‘ఇంటి రెండో అంతస్తులో 320 చదరపు అడుగుల గదిలో కుంకుమ పువ్వు సాగు చేపట్టాను. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.6.50 లక్షలు ఖర్చయ్యింది. కుంకుమ పువ్వు మొక్కల్ని పంపోర్ నుంచి తెప్పించా. ఈ సీజన్ ముగిసేలోపు 1.5 కిలోల నుంచి 2 కిలోల వరకు కుంకుమ పువ్వు చేతికొస్తుందని భావిస్తున్నా. దేశీయ మార్కెట్లో దీని ధర కిలో రూ.5 లక్షలు ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.8.50 లక్షల వరకు పలికే అవకాశం ఉంది’’ అని తెలిపారు. పంట సాగు చేస్తున్న గదిలో మొక్కల కోసం పాటలు పెడతానని చెప్పాడు. అసలేంటీ ఏరోపోనిక్స్.. ఎలాంటి మట్టి లేకుండా గాలి లేదా పొగమంచు వాతావరణంలో మొక్కల్ని పెంచే ప్రక్రియ.