పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జంప్!!

ఇంద్రధనుస్సు ప్రతినిధి:

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపులు జరుగుతున్నాయి. నైతిక విలువలను పక్కన పెట్టి గులాబీ పార్టీ గుర్తుపై గెలిచిన పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఇప్పటి వరకు పది మంది ఎమ్మెల్యేలు గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో పదహారు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరితే బిఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది. అప్పుడు ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత చెల్లుబాటు కాదు. గతంలో కెసిఆర్ ఏదైతే చేశారో అదే పని ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఇలాంటి నైతిక విలువలు లేని రాజకీయాలు ఎవరూ చేయకూడదు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మీద ఇప్పటికే ఇడి దాడులు చేసి కేసు నమోదు చేసింది. కేసులు లేకుండా చేసుకోవటానికి ముందుగా బిజెపిలో చేరాలని ప్రయత్నం చేస్తే, వారు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రమ్మన్నారు. ఎందుకొచ్చిన అవస్థ అనుకొని చక్కగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నియోజకవర్గం ఇంఛార్జిగా ఉన్నకాటా శ్రీనివాస్ గౌడ్ ఈ చేరిక పట్ల మౌనంగా ఉన్నారు. రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ మరియు జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మెదక్ ఎంపీగా పోటీ చేసిన నీలం మధు ఈ చేరిక పట్ల సానుకూలంగా ఉన్నారు. ఎమ్మెల్యే చేరిన కార్యక్రమంలో కూడా నీలం మధు కనిపించారు. కాటా శ్రీనివాస్ గౌడ్ వర్గీయులు ఎవరూ కనిపించలేదు. రానున్నరోజుల్లో పటాన్ చెరు నియోజకవర్గంలో ఏం జరగబోతుందో తెలియాలంటే కొంత కాలం వేచి చూడాల్సిందే!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *